వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మైనారిటీ సంఘాలు, ప్రజాసంఘాలు ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ పిలుపునిచ్చారు. ప్రతి ఓటును కాపాడుకునే విధంగా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తుతం ఓటర్ల జాబితాపై క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఓట్లను చీల్చే కుట్రలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఎస్‌ఐఆర్ ప్రభావం తీవ్రంగా కనిపించిందని, అదే పరిస్థితులు ఇతర రాష్ట్రాల్లో కూడా తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కొన్ని పోలింగ్ బూత్‌లలో అసాధారణంగా ఓట్లు పెరగడం, మరికొన్ని బూత్‌లలో ఓట్లు తగ్గిపోవడం వంటి అంశాలను ప్రజలు జాగ్రత్తగా గమనించాలని సూచించారు. ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, ప్రతి పోలింగ్ బూత్‌లో ఒక్క ఓటు కూడా తొలగించకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
మైనారిటీలు, పార్టీ శ్రేణులు, యువత, ప్రజాసంఘాల ప్రతినిధులు ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి అనుమానాస్పద మార్పులపై వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని గులాం రసూల్ కోరారు. ఓటు హక్కును రక్షించుకోవడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలమని ఆయన పేర్కొన్నారు.